Leviticus 9

1ఎనిమిదో రోజు మోషే అహరోనునూ, అతని కొడుకులనూ, ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలనూ పిలిచాడు. 2అహరోనుతో ఇలా అన్నాడు. <<పాపం కోసం బలి అర్పణగా మందలో నుండి లోపం లేని ఒక దూడనీ, దహనబలి కోసం లోపం లేని ఒక పొట్టేలునూ యెహోవా సమక్షంలోకి తీసుకు రా.

3నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పాలి. యెహోవాకి అర్పించడానికి పాపం కోసం బలిగా లోపం లేని మేకపోతునూ, దహనబలి కోసం ఒక్క సంవత్సరం వయసున్న లోపం లేని ఒక దూడనూ, ఒక గొర్రెెపిల్లనూ, తీసుకు రండి. 4అలాగే యెహోవాకి శాంతిబలి అర్పించడానికి ఒక ఎద్దునూ, ఒక పొట్టేలునూ, నూనె కలిపిన నైవేద్యాన్నీ తీసుకు రండి. ఎందుకంటే ఈ రోజు మీకు యెహోవా దర్శనమిస్తాడు>> 5కాబట్టి వాళ్ళు మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ప్రత్యక్ష గుడారం దగ్గరకు తీసుకు వచ్చారు. ఇశ్రాయేలు సమాజమంతా వచ్చి యెహోవా సమక్షంలో నిల్చున్నారు.

6అప్పుడు మోషే ఇలా అన్నాడు. <<యెహోవా మీకు ఆజ్ఞాపించింది ఇదే. మీరిది చేస్తే ఆయన తేజస్సు మీకు కనిపిస్తుంది>>. 7తరువాత మోషే అహరోనుకి ఇలా చెప్పాడు. <<బలిపీఠం దగ్గరకు రా, యెహోవా ఆజ్ఞాపించినట్టు నీ పాపం కోసం అర్పించాల్సిన బలినీ, నీ కోసం దహనబలినీ అర్పించి నీ కోసం, ప్రజల కోసం పరిహారం చెయ్యి. ప్రజల కోసం బలి అర్పించి వాళ్ళ కోసం పరిహారం చెయ్యి.>>

8కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్ళాడు. తన పాపాల కోసం బలి అర్పణగా దూడను వధించాడు. 9అతని కొడుకులు దాని రక్తాన్ని అతని దగ్గరకు తీసుకు వచ్చారు. అహరోను ఆ రక్తంలో తన వేలు ముంచి బలిపీఠపు కొమ్ముల పైన పూశాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు.

10అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు దహనబలిగా దాని కొవ్వునూ, మూత్రపిండాలనూ, కాలేయం పైన పేరుకున్న కొవ్వునూ, బలిపీఠం పైన దహించాడు. 11దాని మాంసాన్నీ, చర్మాన్నీ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.

12ఆ తరువాత అహరోను దహనబలి పశువును వధించాడు. అతని కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. ఆ రక్తాన్ని అహరోను బలిపీఠం అన్ని వైపులా చిమ్మాడు. 13తరువాత వాళ్ళు అతనికి దహనబలి పశువును ముక్కలు చేసి ఆ ముక్కలనూ, తలనూ ఇచ్చారు. అతడు వాటిని బలిపీఠం పైన దహించాడు. 14దాని అంతర్భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడిగి బలిపీఠం పై ఉన్న దహనబలి అర్పణలపై ఉంచి వాటిని కూడా దహించాడు.

15తరువాత అహరోను ప్రజల కోసం బలి అర్పించాడు. మేకను పట్టుకుని ప్రజల పాపం కోసం బలి అర్పణగా దాన్ని వధించాడు. మొదటి మేకను వధించినట్టుగానే దీన్ని కూడా పాపాల కోసం వధించాడు. 16తరువాత యెహోవా ఆజ్ఞాపించినట్టుగా దహనబలి జంతువును అర్పించాడు. 17దాని తరువాత నైవేద్యాన్ని తెచ్చి దానిలోనుంచి ఒక పిడికెడు తీసి బలిపీఠంపై దాన్ని ఉదయం చెల్లించాల్సిన దహనబలితో పాటు దహించాడు.

18తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన శాంతిబలి అర్పణగా ఎద్దునూ, పోట్టేలునూ వధించాడు. అహరోను కొడుకులు వాటి రక్తాన్ని అతనికి అందించారు. దాన్ని అతడు బలిపీఠం చుట్టూ చిమ్మాడు. 19అయితే వాళ్ళు ఆ ఎద్దు కొవ్వునూ, పొట్టేలు కొవ్వునూ, కొవ్వుపట్టిన తోకనూ, వాటి అంతర్భాగాల్లోని కొవ్వునూ, మూత్రపిండాలనూ, కాలేయం పై అంటి ఉన్న కొవ్వునూ అతని కిచ్చారు.

20వాళ్ళు వీటిని ఆ పశువుల రొమ్ము భాగం పైన ఉంచారు. అప్పుడు అహరోను ఆ కొవ్వును బలిపీఠంపై దహించాడు. 21మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను రొమ్ము భాగాన్నీ, కుడి తొడ భాగాన్నీ యెహోవా సమక్షంలో పైకెత్తి అర్పణగా ఆయనకు అర్పించాడు.

22ఆ తరువాత అహరోను పాపం కోసం బలినీ, దహనబలినీ, శాంతిబలినీ అర్పించి, తన చేతుల్ని ప్రజల వైపు ఎత్తి వాళ్ళను దీవించాడు. తరువాత దిగి వచ్చాడు. 23మోషే, అహరోనులు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళారు. తిరిగి వచ్చి ప్రజల్ని దీవించారు. అప్పుడు యెహోవా మహిమ తేజం ప్రజలందరికీ కన్పించింది. యెహోవా సమక్షం లోనుండి అగ్నిజ్వాలలు బయలుదేరి బలిపీఠం పైన ఉన్న దహనబలి సామగ్రినీ, కొవ్వునీ కాల్చి వేశాయి. అది చూసి ప్రజలంతా ఉత్సాహంగా కేకలు పెట్టారు. సాష్టాంగ నమస్కారం చేశారు.

24

Copyright information for TelULB